Kishan Reddy: CM KCRకి కిషన్ రెడ్డి లేఖ.. ఆ ఫండ్స్ పరిస్థితి ఏంటీ?
తెలంగాణలో గత మూడేళ్లలో కంపా నిధుల(CAMPA funds) నుంచి కేటాయించిన రూ.610 కోట్ల నిధులను వినియోగించకపోవడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కి… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. అడవుల పెంపకానికి సంబంధించిన కేటాయించిన నిధులను వినియోగించుకోవాలంటూ లేఖలో పేర్కొనడం విశేషం. 610 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధుల గురించి ఆ లేఖలో తెలియజేశారు. మానవ అవసరాల కోసం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తుందని..దీంతో ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమేకాకుండా, ప్రాకృతిక విపత్తులు సంభవించటానికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.అందులో భాగంగానే “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్”(CAMPA funds) ను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణకి రూ.3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేసిందని తెలిపారు. అయితే గత 3 ఏళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే, ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. వినియోగానికి ఆమోదం పొందిన నిధుల విలువకు, వినియోగించుకున్న నిధుల విలువకు దాదాపు 610 కోట్ల వ్యత్యాసం ఉందని ఆరోపించారు.