కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో… అప్పుడే.. చంద్రబాబు కూడా.. తెలంగాణలో టీడీపీని నిలపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కూడా వేర్వేరు పార్టీల్లోచేరిపోయారు. కాగా.. ఇప్పుడు మళ్లీ… ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కొత్త అధ్యక్షుడిని కూడా నియమించారు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా ఎదగడానికి పునాది వేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు చంద్రబాబు.
తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగు దేశం అన్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ పుట్టిందన్నారు చంద్రబాబు. తెలుగు జాతి అభివృద్ధికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాజకీయాలకు కొత్త అర్థం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు చంద్రబాబు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన.. భాగ్యనగరంలో ల్యాండ్ విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కాలేజీలు వచ్చాయన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీనే అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి నాంది వేసింది టీడీపీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ నాగలితో పాటు.. మౌస్ పట్టుకోవాలని అప్పుడే చెప్పానని ఆయన తెలిపారు.