»Bjp Releases Second List Of 23 Candidates In Karnataka Polls
Karnataka: 23 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar)పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
Karnataka: కర్ణాటకలో ఎలక్షన్ రాజకీయాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీలో బరిలో నిలిచే వాళ్ల పేర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే అధికార బీజేపీ(BJP) కూడా ఎన్నికల బరిలో నిలిచే వాళ్ల రెండో జాబితా విడుదల చేసింది. 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటక(Karnataka)లో .. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రెండు రోజుల క్రితమే బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. తాజాగా, బుధవారం రాత్రి 23మందితో రెండో విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. అయితే, రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ రెండో జాబితాలో హుబ్బళ్లి-ధర్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(jagadish shettar)కు స్థానం దక్కకపోవడం గమనార్హం. అయితే, తనకు టికెట్ కేటాయించకపోతే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ తాజా జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. రెండు జాబితాల్లోనే మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) బుధవారం చెప్పినప్పటికీ.. ఇప్పుడు మూడో జాబితా కూడా విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది. హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ షెట్టర్‌కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప కూడా షెట్టర్‌కు 99 శాతం టికెట్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.