»Tamil Nadu Governor Rn Ravi Gives Assent To Bill Banning Online Rummy
Rummy Ban స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్.. పెండింగ్ బిల్లులు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు.
దేశంలో గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీ నాయకులు గవర్నర్లుగా నియమితులైన వారు పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాల్సిన వారు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు తెలంగాణతోపాటు (Telangana) తమిళనాడు (Tamil Nadu), పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో తరచూ కనిపిస్తున్నాయి. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు న్యాయస్థానాల వరకు చేరుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) వ్యవహారం మరింత వివాదాస్పదంగా ఉంది. అయితే వారికి బుద్ధి చెప్పేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు. ఇలాంటి పరిణామామే తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ రెండూ సంఘటనలు ఒకే రోజు జరుగడం విశేషం.
కాగా, తమ గవర్నర్ ఆర్ఎన్ రవికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఝలక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని సోమవారం కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. అయితే సాయంత్రానికే గవర్నర్ రవి పెండింగ్ బిల్లులు (Bills) ఆమోదించారు. తమిళనాడులో ఆన్ లైన్ రమ్మీతో (Online Rummu) డబ్బులు పోగొట్టుకుని ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో ప్రభుత్వం రమ్మీని నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
ఆన్ లైన్ రమ్మీని నిషేధిస్తూ గతేడాది అక్టోబర్ 19వ తేదీని అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. అనంతరం గవర్నర్ కు పంపగా.. కొన్ని వివరణలు కోరాడు. వాటికి సమాధానం చెప్పగా గవర్నర్ ఆమోదించకుండా తాత్సారం చేశారు. తీరా నాలుగు నెలల అనంతరం ఆ చట్టం రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ బిల్లును తిప్పి పంపారు. తాజాగా మరోసారి ఆ బిల్లును రూపొందించి గవర్నర్ కు పంపారు. ఆ బిల్లుతో పాటు మిగతా బిల్లులు ఆమోదించకపోవడంతో ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా గవర్నర్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు తీసుకువచ్చారు. ఈ పరిణామాలతో గవర్నర్ రవి వెనక్కి తగ్గారు. ఆన్ లైన్ రమ్మీని నిషేధిస్తూ తీసుకువచ్చిన బిల్లును ఆమోదం తెలిపారు.