పదో తరగతి ప్రశ్నాపత్రాల (SSC Exam Leaks) లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలై కరీంనగర్ (KarimaNagar)లోని తన నివాసానికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం సంజయ్ కు సంఘీభావం తెలిపింది. వారితో పాటు పలువురు సంజయ్ కు ఫోన్ (Phone)లలో పరామర్శించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), పార్టీ ముఖ్య నాయకులు తరుణ్ చుగ్ (TarunChug), సునీల్ బన్సల్ (Sunil Bansal), స్మృతి ఇరానీ, తదితరులు ఫోన్లు చేసి సంజయ్ తో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం, పార్టీ జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుందని కేంద్ర పెద్దలు సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ (BRS Party) కుట్రలను తిప్పి కొట్టాలని చెప్పారు. కాగా కరీంనగర్ లో సంజయ్ అత్త దినకర్మకు బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తో పాటు పార్టీ కీలక నాయకులు హాజరు కానున్నారు. కాగా సంజయ్ జైలు నుంచి విడుదల కావడంతో కరీంనగర్ లో పోలీసులు ఆంక్షలు విధించారు.
ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో సంజయ్ అరెస్టైన విషయం తెలిసిందే. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇక సంజయ్ ను విడుదల చేయించడంపై బీజేపీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద సంజయ్ ను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి వరకు హన్మంకొండ మున్సిఫ్ కోర్టులో వాదోపవాదాలు జరగ్గా.. చివరకు సంజయ్ కు ఊరట లభించింది. బెయిల్ లభించడంతో శుక్రవారం ఉదయం బయటకు వచ్చాడు.