తన తండ్రి డీ శ్రీనివాస్ రాజీనామా (D Srinivas resigns Congress) వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు (Nizamabad MP), బీజేపీ నేత (BJP Leader) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) వివరణ ఇచ్చారు. తన తండ్రి గాంధీ భవన్ (Gandhi Bhavan) వెళ్లడం, కాంగ్రెస్ లో (Congress) చేరడం, ఆ తర్వాత రాజీనామా (Resign from Congress) చేయడం ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారిందని ఈ వ్యవహారంలోకి తనను లాగవద్దని అభిప్రాయపడ్డారు. తన తండ్రి కాంగ్రెస్ వాది అని తాను మొదటి నుండి చెబుతున్నానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నట్లు తెలిపారు. తన తండ్రి కాంగ్రెస్ (Congress) వాడే అని గత అయిదేళ్లలో 50సార్లు చెప్పానని, అలాగే తాను కట్టర్ బీజేపీ అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ వాది అన్నారు. అయితే డీఎస్ వంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న సమయంలో ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఆలోచించవలసిందని అభిప్రాయపడ్డారు. ఆయనకు గ్రీన్ స్టోక్స్ వస్తోంది.. హైపర్ టెన్షన్ ఉంది.. ఫిట్స్ వస్తున్నాయి.. మైల్డ్ పెరాలసిస్ వచ్చింది.. ఇలాంటి పరిస్థితుల్లో.. ముఖ్యంగా బాత్రూంకు కూడా వెళ్లలేని వ్యక్తిని గాంధీ భవన్ తీసుకు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పి చేర్చుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పైగా నిన్న ఫిట్స్ వచ్చాయని, దీంతో ఇలాంటి సమయంలో పార్టీలో చేర్చుకోవడం తన తల్లికి నచ్చలేదన్నారు.
ఆయన 2018 నుండి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరుతానని చెబుతున్నప్పటికీ, మీరు తీసుకోలేదని, కానీ ఆరోగ్యం బాగా లేని సమయంలో వచ్చి చేర్చుకోవడం ఏమిటని నిలదీశాలు. పైగా, డీఎస్ వంటి వ్యక్తి ఆరోగ్యం ఇలా ఉంటే సోనియా గాంధీ (Sonia Gandhi), వారి కుటుంబం కనీసం ఫోన్ చేసి అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ స్టోక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నాలుగేళ్లుగా పార్కిన్ సన్స్ ఉన్న సమయంలోను కనీసం ఫోన్ చేయలేదన్నారు. ఆ కుటుంబానికి, పార్టీకి తన తండ్రి నాలుగు దశాబ్దాలకు పైగా సేవ చేశారన్నారు. అలాంటి వ్యక్తికి ఫోన్ చేసి, ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో పాటు.. శ్రీనివాస్ గారూ… మీ ఆరోగ్యం బాగుపడ్డాక పార్టీలోకి తీసుకుంటాం.. నా కొడుకు లేదా కూతురు సమక్షంలో పార్టీలో చేర్చుకుంటామని సోనియా గాంధీ చెప్పవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదన్నారు. తన తండ్రి కాంగ్రెస్ వాది అయినప్పటికీ, నాకు ఇష్టమైన బీజేపీ వైపు నడిచానని చెప్పారు. 2015లో కాంగ్రెస్ పార్టీయే ఆయనను బయటకు పంపించిందని, 2018 నుండి చేరుతానంటే మాట్లాడకుండా… ఇప్పుడు ఆరోగ్యం బాగా లేనప్పుడు చేర్చుకోవడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టవద్దన్నారు. తన తండ్రి రాజకీయానికి, తన రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఏం జరిగింది?
డీ శ్రీనివాస్, ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ ఆదివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ఇలాంటి సమయంలో తన భర్తను రాజకీయాలకు వాడుకోవద్దంటూ డీఎస్ సతీమణి లేఖ రాశారు. ఆ తర్వాత వీడియో ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో సోమవారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ బయటకు వచ్చింది.
తన పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అక్కడకు వెళ్తే తాను కూడా పార్టీలో చేరినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే అని, అనారోగ్యం దృష్ట్యా తనను వివాదాల్లోకి లాగవద్దన్నారు. ఒకవేళ తాను పార్టీలో చేరినట్లుగా భావిస్తే, ఇది రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరారు. ఈ అంశంపై సంజయ్ కూడా స్పందించారు. బీజేపీ ఎంపిగా ఉన్న తమ కుటుంబ సభ్యులు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి తన తండ్రి పైన ఒత్తిడి తెచ్చి, లేఖ రాయించారన్నారు. దీంతో ధర్మపురి అరవింద్ వివరణ ఇచ్చారు.