జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం.
రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువుకొంటున్నారు. విద్యా సంస్థలు విడిచి పెట్టాక బస్సులు లేక చాలా దూరం చీకటిలో నడిచి వెళ్లాల్సి వస్తోంది అన్నారు.
అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో చదువుకొనే పిల్లలు భయపడుతున్నారన్నారని ట్వీట్ లో పేర్కొన్నారు పవన్. ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా సక్రమంగా నడపకపోవడం, తరచూ ఆ సర్వీసు రద్దు చేస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చీకటిలో నడిచి వెళ్తున్నారన్నారు. ఈ పరిస్థితిని మీడియా కూడా వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి స్టూడెంట్స్ కోసం బస్సు నడపాలని పవన్ కోరారు. బస్సు సదుపాయం లేదనో.. అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడో విద్యార్ధినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, తెలంగాణ సీఎంఓకు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లకు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ పవన్ రిక్వెస్ట్ చేశారు.