విభిన్నమైన నేపథ్యంలో కథలను తీసుకువస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ (Mythri Movie Makers). పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తోంది. ఇక తెలుగు వారి ఏకైక ఓటీటీ సంస్థ ఆహా (Aha) కూడా చిన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం (Village Background)లోని కథా వస్తువులకు విలువనిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ నేపథ్యంలో మరో సినిమాను ఓటీటీప్రియులకు అందిస్తోంది. అదే సినిమా ‘సత్తిగాడి రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu). పలాస 1978 సినిమాతో మెప్పించిన జగదీశ్ ప్రతాప్ (Jagadeesh Prathap) పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ పక్కన మెరిసిన విషయం తెలిసిందే.
తెలంగాణ (Telangana)లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District)కు చెందిన జగదీశ్ ప్రధాన పాత్రలో ‘సత్తిగాడి రెండెకరాలు’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. అభివన్ రెడ్డి దండ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆహా (Aha)లో ఈనెల 17వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. కాగా డిజిటల్ రంగంలోకి ఈ సినిమాతోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అడుగు పెడుతోంది.
హీరో సత్తిగాడు (జగదీశ్) ఆటో డ్రైవర్. భార్య పిల్లలు ఉన్నారు. అతడికి ఒక సమస్య వస్తే దానికోసం ఆటో అమ్ముతాడు. అయినా డబ్బులు సరిపోలేవు. రూ.25 లక్షలు కావాల్సి ఉంటే అతడు ఏం చేశాడనేది ముఖ్యమైంది. డబ్బుల కోసం అతడు ఏం చేశాడు.. ఆ తదుపరి జరిగే పరిణామాలే మిగతా కథ. ఈ క్రమంలోనే ఈ రెండెకరాలు అనేది ఏమిటనేది సినిమా చూడాలని చిత్రబృందం చెబుతోంది. బిత్తిరి సత్తి, వెన్నెల కిశోర్, మోహన శ్రీ, అనీశా దామ, రాజ్ తిరందాస్ తదితరులు మిగతా ప్రధాన పాత్రల్లో మెరుస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో చిన్న అంశాన్ని పట్టుకుని ఈ సినిమాను తీర్చిదిద్దారు. పల్లెటూరు ఇతివృత్తంగా సాగుతున్న ఈ సినిమా ఓటీటీప్రియులను ఆకట్టుకుంటోంది. హాస్యంతో పాటు విలనిజం పండిస్తున్న జగదీశ్ సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. జగదీశ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. పుష్ప-1లో అల్లు అర్జున్ కు సమానంగా ప్రశంసలు పొందిన నటుడు జగదీశ్. ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాలు చేశాడు. ఇంకా పెద్ద సినిమా అతడి చేతికి రాలేదు. ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్నాడు. పుష్ప -2లో జగదీశ్ పాత్ర మరింత బలంగా ఉంటుందని తెలుస్తున్నది. కాగా సత్తిగాడికి రెండెకరాలు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విశ్వనాథ్ రెడ్డి, సంగీతం జై క్రిష్ అందించగా పాటలు కాసర్ల శ్యామ్ రాశాడు. బలగం సినిమా మాదిరి తెలంగాణ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మరో తెలంగాణ సినిమా సత్తిగాడి రెండెకరాలు.