ఏపీ రాజధాని విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. కాగా.. తాజాగా ఈ విషయంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ప్రకటించారు. విశాఖలో నూతనంగా ఏర్పాటయిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ కామెంట్స్ చేశారు. రైతుకు మద్దుతుగా నిలిచే సందర్భంలో ఈ ప్రభుత్వం అందరి కన్నా ముందు ఉందని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. అయితే ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన కష్టం రాజధాని అని తెలిపారు. గతంలో చెన్నయ్ రాజధానిగా ఉండగా.. 1100 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
దీని వల్ల అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఆ తర్వాత రాజధానిని కర్నూలుకు మార్చగా.. ఎనిమిది వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదన్నారు. అక్కడికి చేరుకోవాలంటే రెండు రోజుల సమయం పట్టేదని… దీని వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కున్నామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక హైదరాబాద్ ను రాజధానిగా చేశారని.. అది కూడా విశాఖకు చాలా దూరం అని చెప్పారు.
130 ఏళ్ల తర్వాత విశాఖకు రాజధాని ఏర్పాటు అయ్యే అవకాశం వస్తే చంద్రబాబు వద్దని చెప్తున్నారని అన్నారు. మీకు రాజధాని వద్దు, మీకు అభివృద్ధి వద్దు అంటూ అమరావతి రైతులు ఇక్కడికి యాత్రగా వస్తున్నారని తెలిపారు. అమరావతి రైతుల కోసం విశాఖ ప్రజల నోట్లో మట్టి కొడితే ఎలా అని ప్రశ్నించారు.
వ్యవసాయం చేసిన వాడిగా ఒక రైతు కష్టసుఖాలు తనకు తెలుసు అని అన్నారు. రక్తం ధారపోసే రైతుకు కేంద్రం ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే సాయం చేస్తే అందరికీ అభివృద్ధి ఫలాలు అందవు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరారు.