Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.
విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే… స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో… ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా… ఈ ఘటనపై పవన్ స్పందించారు.
ఆ బిడ్డ తల్లిదండ్రులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని ఆ శిశువు మృతదేహాన్ని తీసుకు వెళ్లారని పవన్ పేర్కొన్నారు. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుందని కానీ ఈ పాషాణ ప్రభుత్వంలో మాత్రం స్పందన ఉండదని అన్నారు. కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయం అని ఆయన అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని అన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదని, బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదన్న ఆయన ప్రజలకు సేవలు అందాలని అన్నారు. ఇక ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే- విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్ విమర్శించారు.