BBC IT survey: శాలరీ గురించి అడిగితే… ఉద్యోగులకు మెయిల్
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే నేపథ్యంలో ఈ దిగ్గజ మీడియా కంపెనీ తమ ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఖ రాసింది. Income Tax అధికారులకు ఉద్యోగులు సహకరించాలని సూచించింది. వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని తెలిపింది. కంపెనీ నుండి వచ్చే మీ వేతనం గురించి అడిగితే సమాధానం చెప్పాలని, వ్యక్తిగత ఆదాయం గురించి అడిగితే మాత్రం స్పందించకుండా ఉండవచ్చునని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. బ్రాడ్ కాస్ట్ విభాగం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మిగిలిన వారు ఇంటి వద్ద నుండి పని చేయాలని తెలిపింది. ఈ సర్వే గురించి సోషల్ మీడియాలో (Social Media) స్పందించవద్దని స్పష్టం చేసింది. అంతకుముందు కూడా ఈ బ్రిటిషన్ బ్రాడ్ కాస్టర్ (BBC)… విచారణ సంస్థలకు సహకరించాలని సూచించింది. సాధ్యమైనంత త్వరలో ఇది ముగుస్తుందని అభిప్రాయపడింది. మంగళవారం రాత్రి ఢిల్లీ, ముంబైలలోని తమ కార్యాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోయారని, కొంతమందిని మాత్రం ప్రశ్నించేందుకు ఆపినట్లు చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు అండగా ఉంటామని, తమ ఔట్ పుట్, జర్నలిజం ఇలాగే కొనసాగుతుందని తెలిపింది.
బీబీసీ కార్యాలయాల్లో భారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని, భావప్రకటనా స్వేచ్ఛ, మతం, విశ్వాసం వంటి వాటిని ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే ఉన్నామన్నారు. భారత్, అమెరికా.. ఈ రెండు దేశాలు వీటిని ఎప్పుడూ పాటించాయన్నారు. బీబీసీలో సోదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమా అని విలేకరులు ప్రశ్నించగా… అలా ఎలా చెప్పగలమన్నారు. ఈ సోదాలు ఎందుకు జరిగాయో తెలుసునని, కానీ బయటకు చెప్పలేమన్నారు. తద్వారా బీబీసీ తప్పు చేయకుంటే సోదాల తర్వాత ఏం జరగదని, తప్పు చేస్తే తేలుతుందని అభిప్రాయపడ్డారు.
బీబీసీ కార్యాలయాల్లో సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు స్పందించవలసి ఉంది. మంగళవారం ఉదయం 11.30 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన బుధవారం కూడా కొనసాగుతున్నాయి. పూర్తి సర్వే అనంతరం కేంద్ర ప్రభుత్వం, ఐటీ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశముంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ… పన్ను ఎగవేత, అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నప్పుడు ఐటీ అధికారులు సర్వేలు చేస్తారన్నారు. సర్వే పూర్తయ్యాక ప్రెస్ నోట్ లేదా మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంటుందన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు అంశాలకు సంబంధించి ఈ సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని అంటున్నారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి బీబీసీ అకౌంట్స్ బుక్స్‌ను, బ్యాలెన్స్ షీట్ తదితర అకౌంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి సోదాలు కాదని, సర్వే మాత్రమేనని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉందంటూ ‘ఇండియా, ది మోడీ క్వశ్చన్’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ అల్లర్లకు సంబంధించి న్యాయస్థానాల్లో క్లీన్ చిట్ లభించిన తర్వాత కూడా బీబీసీ ఉద్దేశ్యపూర్వకంగా ఈ డాక్యుమెంటరీని తీసుకు వచ్చింది. గుజరాత్ అల్లర్లలో ఇరువైపుల నష్టం గురించి ఎవరూ మాట్లాడటం లేదని, మోడీని బద్నాం చేసేందుకు ఒకవైపు మాత్రమే నష్టం జరిగిందని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ డాక్యుమెంటరీలో కూడా కట్టుకథ కనిపిస్తోందని మండిపడింది. ఈ డాక్యుమెంటరీ లింకుల్ని నిషేధించింది. ఇదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగింది.