»Ktr Review On Telangana New Secretariat Opening Ceremony
KTR సచివాలయం ప్రారంభం.. ఖమ్మం సభను మించిపోవాలి
పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.
హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ (Telangana) కలల రూపం శ్వేతసౌధం ముస్తాబవుతోంది. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరంలో తెలంగాణ ఆత్మగౌరవం తలెత్తుకుని నిలబడినట్టు కొత్త సచివాలయం (New Secretariat) కనిపిస్తున్నది. ఉమ్మడి పాలకులు తెలంగాణపై కక్ష, కుట్రలను సచివాలయం నుంచే సాగించారు. అలాంటి గుర్తులు చెరిపేసి అదే స్థానంలో తెలంగాణ ఆత్మగౌరవం సగౌరవంగా ఇప్పుడు భవనం రూపంలో నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవనం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. అయితే భవనం ప్రారంభోత్సవం మునుపెన్నడూ జరగని రీతిలో కార్యక్రమం ఉండాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (KT Rama Rao) తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు మంత్రులతో సచివాలయం ప్రారంభోత్సవంపై సమీక్ష చేశారు. అనంతరం పరేడ్ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్షించారు.
ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం జరుగనుంది. ఆ తదనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్ వారితో చర్చించారు. సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్ మైదానం సభను అందరం కలిసికట్టుగా విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు.
ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా ఇంచార్జిలు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి 15 వేల మందిని తరలించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవం, సభ సందర్భంగా హైదరాబాద్ మొత్తం గులాబీమయం కావాలని మంత్రి తలసానికి చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ నాయకులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కేటీఆర్ తలసానికి సూచించినట్లు తెలుస్తున్నది.
తరలిరానున్న దిగ్గజాలు
బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ (KCR) మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే ఖమ్మం (Khammam)లో నిర్వహించిన సభతో దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగ్ వంత్ మాన్ తరలిరావడంతో ఆ సభ ఊహించని విజయం సాధించింది. సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం జరిగే సభకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Memanth Soren), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) తోపాటు ఇతర పార్టీల ప్రముఖులు తరలిరానున్నారు. పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.