»Telangana Govt Rs 100 Cr Released To Kondagattu Temple
Kondagattu అంజన్నకు రూ.వంద కోట్లు.. అద్భుతంగా ఆలయం
ధూపదీప నైవేద్యాలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురైన ఆలయాలకు జీవం కల్పించేందుకు సిద్ధమైంది.
ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం (Telangana) ప్రత్యేక దృష్టి సారించింది. ధూపదీప నైవేద్యాలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురైన ఆలయాలకు జీవం కల్పించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పున:నిర్మాణం చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిగతా ఆలయాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ క్రమంలో వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఇటీవల మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Temple) ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ లో జగిత్యాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆలయానికి రూ.వంద కోట్లు విడుదల చేస్తానని ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు తాజాగా నిధులు విడుదలయ్యాయి. ఇటీవల ఈ ఆలయం నుంచే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని.. తనకు పునర్జన్మ లభించిందని పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటాడు.
భక్తుల కొంగు బంగారం
అంతటి శక్తిగల ఆలయంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం ప్రసిద్ధిగాంచింది. భక్తుల పాలిట కొంగు బంగారంగా అంజన్న ఖ్యాతిగాంచాడు. ఈ క్షేత్రానికి ఏడాది పొడవున భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర వేడుకలకు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం కొండగట్టు ఆలయం భక్తుల రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు లేవు. ఇరుకైన రోడ్లు, భక్తులకు సరిపడా వసతులు అరకొరగా ఉన్నాయి. ఈ విషయాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ కు తెలిపారు. పలుమార్లు ఆలయానికి నిధులు ప్రకటిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇన్నాళ్లకు నెరవేరింది.
ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. త్వరలోనే ఆలయ అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఆలయ అభివృద్ధి ఆగమశాస్త్రం ప్రకారం చేయనున్నారు. ఈ పనుల కోసం సీఎం కేసీఆర్ త్వరలోనే అంజన్న క్షేత్రానికి రానున్నారు. ఆలయాన్ని యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేయనున్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని కాస్త రూ.వందల కోట్లు ఖర్చు చేసి యాదాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దించారు. అలాగే కొండగట్టు క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయించనున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నది. చర్చిలు, మసీదులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. గతంలోనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వేములవాడ, ఆలంపూర్ జోగులాంబ, మన్యంకొండ, వేములవాడ, బాసర, భద్రాచలం, కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు, ఏడుపాయల, కాళేశ్వరం, మేడారం సమక్క సారక్క, బల్కంపేట ఎల్లమ్మ తల్లి తదితర ఆలయాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. క్రమనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ పలు సభల్లో పేర్కొన్నారు. అందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులతో తరచూ చర్చలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధి పనులు జరగనున్నాయి.