Gautam Gambhir: Gambhir is now the head coach of Team India
Gautam Gambhir: మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతన్ని బీసీసీఐ ఎంపిక చేసింది. 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన గంభీర్ ముందు నుంచి కూడా కోచ్ రేసులో ఉన్నారు. శ్రీలంక పర్యటనతో గంభీర్ టీమ్ఇండియా కోచ్‌గా మారనున్నారు. జులై 27న మొదలయ్యే ఈ పర్యటనలో టీమ్ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. జట్టుకు గొప్పగా మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు తరఫున కృతజ్ఞతలు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ఇండియా ప్రయాణం సాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఓ ప్రకటనలో తెలిపాడు.
ప్రధాన కోచ్‌గా గంభీర్ నియామకంతో భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అతడు అనుభవజ్ఞుడు, అంకితభావం ఉన్న వ్యక్తి. అతడి నాయకత్వంలో భారత జట్టు తన పురోగతిని కొనసాగిస్తుందని, దేశం గర్వపడేలా చేస్తుందని నమ్మకంతో ఉన్నామని బిన్నీ వివరించాడు. టీమ్ఇండియా తరఫున గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో గంభీరే టాప్‌స్కోరర్. ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతాకు ప్రస్తుతం గంభీర్ మెంటర్‌గా ఉన్నారు.