టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భవిష్యత్తును ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ద్రావిడ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
Rahul Dravid: భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలను అందించిన రాహుల్ ద్రావిడ్ … క్రికెట్ కోచ్‌గానూ తనని తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ 20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ద్రావిడ్ అనేక రకాలుగా తీర్చిదిద్దాడు. ఈ అనుభవమే రాహుల్ ద్రావిడ్‌కు ఆదరణ పెరిగేలా చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుంచి పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ జట్టుకు మెంటార్‌గా ద్రావిడ్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ విషయమై ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహించి…ఇటీవలే ఆ పదవి నుంచి తప్పుకున్న సందర్భంగా రాహుల్ ద్రావిడ్ సరదాగా ఓ కామెంట్ చేశాడు. ఇక నుంచి తానొక నిరుద్యోగినని.. ఏవైనా అవకాశాలుంటే చెప్పండని కూడా ద్రావిడ్ అన్నాడు. తాజా పరిణామాలను గమనిస్తే … ద్రావిడ్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
2011లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన ద్రావిడ్ … ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు సీజన్ల పాటు ఆ జట్టులోనే ఉన్నాడు. 2014లో అదే జట్టుకు మెంటార్‌గా మారాడు. రెండేళ్ల పాటు మెంటార్‌గా సేవలందించాడు. అదే విధంగా 2014లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు కోచ్‌గా కూడా ద్రావిడ్ సేవలందించాడు. ఆ తర్వాత కామెంటేటర్‌గా కూడా కొంత కాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించాడు. అక్కడి నుంచి వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారిపోయాడు. ఇండియా A జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కొన్నేళ్ల తర్వాత అండర్ 19 జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. మంచి ఫలితాలు రాబట్టాడు.
2016లో అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు చేర్చగలిగాడు. 2018లో భారత అండర్ 19 జట్టు ఛాంపియన్‌గా అవతరించడంలోనూ ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత అండర్ 19 జట్టు మట్టికరిపించింది. ఆ జట్టులో శుభ్‌మన్ గిల్, ప్రథ్వీ శా వంటి వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారిద్దరూ భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం వయసు 51 సంవత్సరాలు. తన ఇద్దరు కుమారుల భవిష్యత్తును తీర్చిదిద్దేపని కూడా ద్రావిడ్‌పై ఉంది. సమిత్, అన్వయ్ అనే వీరిద్దరు కూడా క్రికెట్ రంగంలో రాణించేందుకు తహతహలాడుతున్నారు. వారి భవిష్యత్తు కోసం రాహుల్ ద్రావిడ్ ఏడాదిలో పది నెలల పాటు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మిగతా రెండు నెలల సమయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం కేటాయించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటువంటి డీల్ రాహుల్ ద్రావిడ్‌కు సరిగ్గా సరిపోతుంది.
రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మెంటార్‌గా ఎంట్రీ ఇస్తే… ఇప్పటి వరకు మెంటార్‌గా వ్యవహరించిన కుమార్ సంగక్కర వీడ్కోలు పలకనున్నాడు. కుమార్ సంగక్కర 2021 నుంచి రాజస్థాన్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.