Abhishek Sharma: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి అభిషేక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అంచనాలను మించి అదరగొడుతున్నాడు. వారెవ్వా అనిపిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 39 సిక్సర్లు బాదిన అభిషేక్ సిక్సర్ల కింగ్‌గా మారిపోయాడు. తన జట్టును పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి తీసుకుపోయాడు.
Abhishek Sharma: సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్లో వీరవిహారం చేస్తోంది. బలమైన జట్లను సైతం మట్టికరిపించింది. ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో 8 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడంతో ఒక పాయింట్ దక్కించుకుంది. మొత్తంగా 17 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో తలపడనుంది. అమీ తుమీ తేల్చుకోనుంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ వరకు మిడిలార్డర్లో వచ్చిన అభిషేక్ ఈ సీజన్లో ఓపెనర్‌గా వచ్చి ఇరగదీశాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా అభిషేక్ సొంతం చేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 39 సిక్సర్లు బాదడం ద్వారా ఏ ఇతర భారత బ్యాటర్‌కు దక్కని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఉప్పల్‌లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తన సుడిగాలి ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 2016లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తరపున 38 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు అదే అత్యధిక సిక్సర్ల రికార్డు. ఆ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఆ జట్టు తలరాత మారింది. గత మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశ పరిచిన SRH ఈ సారి పుంజుకుంది. కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ జట్టును విజయపథాన నడిపించాయి. అభిషేక్ శర్మను ఓపెనర్‌గా పంపడం కూడా అందులో భాగమే. ఈ మార్పుతో పాటు ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి వారు దూకుడుగా ఆడి జట్టును ఒంటి చేత్తో గెలిపించారు. వీరంతా జట్టుకు దూకుడు నేర్పించారు. వీరిచ్చిన ప్రోత్రాహంతో మిగతా వారు కూడా చివరి వరకూ పోరాడడం నేర్చుకున్నారు.
అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఆడుతున్న తీరును గమనిస్తున్న కొందరు క్రికెట్ దిగ్గజాలు అతడికి మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో అభిషేక్ శర్మ.. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం మైకేల్ వాఘన్ జోస్యం చెప్పాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నికల్‌గా ఎంతో బాగుందని, బ్యాట్‌ను స్వింగ్ చేయడంలో బ్రియాల్ లారా, యువరాజ్ సింగ్‌లను తలపిస్తున్నాడని కూడా మైకేల్ వాఘన్ తెలిపాడు. యశస్వి జైస్వాల్ ఏ విధంగా టీమిండియాలో చోటు సంపాదించాడో.. అదే విధంగా అభిషేక్ శర్మ కూడా భారత జట్టులో చోటు సంపాదిస్తాడని మైకేల్ వాఘన్ నమ్మకం వ్యక్తం చేశాడు. ‘సన్‌రైజర్స్ సారధి ప్యాట్ కమిన్స్ కూడా అభిషేక్ శర్మను పలుమార్లు మెచ్చుకున్నాడు. ప్రాక్టీస్ చేసే సమయంలో అభిషేక్‌కు బౌలింగ్ చేయాలంటే తనకు భయం కలుగుతోందని స్వయంగా ప్యాట్ కమిన్స్ అన్నాడంటే.. అభిషేక్ ఏ రేంజ్లో ఆడుతున్నాడో చెప్పకనే చెప్పవచ్చు.