Ebrahim Raisi: Iran's president dies in plane crash
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో రైసీ(63) మరణించినట్లు ఇరాన్ మీడియా వర్గాలు తెలిపాయి. ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అయితే వీటిని ప్ర్రారంభించడానికి అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్తో కలిసి రైసీ వెళ్లారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత విదేశాంగ మంత్రి హోస్సేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో బయలుదేరారు. దాని వెంట మరో రెండు హెలికాప్టర్లూ బయలుదేరాయి.
జోల్ఫా నగరానికి సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానం నిన్న ప్రమాదానికి గురి కాగా.. ఈరోజు ఘటనా స్థలాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, ఎవరూ బ్రతికి లేరని తెలిపింది. అయితే ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్ సహా ఎంతమంది ఉన్నారనే విషయం అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.