గత వారాంతంలో భారీ పెరుగుదలను నమోదు చేసిన వెండి, బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం వాటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుక్కోవాలని అనుకునే వారికి ఇది ఇది సరైన కాలం కాదనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీటి ధరలు చెప్పుకోదగ్గ రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. మధ్య మధ్యలో అరకొర తగ్గుతున్నప్పటికీ ఓవరాల్ గా ధరలు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. గత వారాంతంలో రికార్డు ధరల్ని నమోదు చేసిన వెండి, బంగారం.. తాజా ధరలు సైతం అలాగే ఉన్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఆదివారం రూ.76,360 ఉండగా, సోమవారం సైతం అలాగే రూ.76,360గానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.76,360గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం స్థిరంగా అలాగే కొనసాగుతోంది. ఆదివారం రూ.92,449 ఉండగా, సోమవారం కూడా రూ.92,449గానే ఉంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభ సమయానికి రెండు లోహాల ధరలూ స్థిరంగానే ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఔన్సు బంగారం సోమవారం 21 డాలర్లు పెరిగి 2415కు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 32.31డాలర్లుగా ఉంది.