Space Tourist : తొలి భారతీయ స్పేస్ టూరిస్ట్‌గా గోపీచంద్ రికార్డు
రాకేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి అడుగుపెట్టిన భారతీయుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ఆయన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్గానూ నిలిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
First Indian Space Tourist : తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర తొలి భారతీయ స్పేస్ టూరిస్ట్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కి సంబంధించిన బ్లూ ఆరిజన్ సంస్థ న్యూషపర్డ్-25 అనే వ్యోమ నౌకను అంతరిక్షంలోకి పంపించింది. దానిలో గోపీచంద్(Gopichandh) స్పేస్ టూరిస్టుగా వెళ్లారు. అక్కడి సమయం ప్రకారం ఆదివారం ఉదయం 9:30గంటలకు అమెరికా, టెక్నాస్‌లోని లాంచింగ్ ప్లేస్ నుంచి ఈ యాత్ర దిగ్విజయంగా మొదలైంది.
ఈ రాకెట్ ద్వారా మొదలైన స్పేస్ టూరిజం యాత్రలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు స్పేస్‌లోకి(SPACE) వెళ్లారు. వారిలో తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ కూడా ఒకరు. ఆయన వృత్తి రీత్యా కమర్షియల్ జట్ ఫ్లైట్లకు పైలెట్. విజయవాడకు చెందిన ఆయన అమెరికాలో స్థిర పడ్డారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఇలా స్పేస్ టూరిజంకి వెళ్లి గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నారు. భూమికి 100 కిలోమీటర్ల పైన కార్మాన్ రేఖ ఉంటుంది. దీన్ని అంతరిక్షానికి, భూమికి సరిహద్దులా భావిస్తారు.
కార్మాన్రేఖ దాటిన తర్వాత రాకెట్ బూస్టర్ క్యాప్సుల్ నుంచి వేరైపోయింది. దీంతో అందులోని వారంతా ఉన్నట్లుండి గాల్లో తేలుతున్న అనభూతిని సొంతం చేసుకున్నారు. భార రహిత స్థితిని ఫీలయ్యారు. క్యాప్సుల్ అద్దాల్లోంచి మిరుమిట్లు గొలిపే భూమి అందాలను వీక్షించారు. అలా కొంత సేపు ఉన్న తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సుల్ సురక్షితంగా భూమిపై తిరిగి ల్యాండ్ అయ్యింది.