ఈ సారి ఆర్ఆర్ఆర్ మూవీకి ‘ఆస్కార్’ ఆస్కారం ఖచ్చితంగా ఉంటుందని.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఊహించని విధంగా.. ఇండియా తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగం కోసం ఆస్కార్ ఎంట్రీకి గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ను ఎంపిక చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా స్క్రీనింగ్ కమిటీపై విరుచుకుపడుతున్నారు. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలవడం పక్కా అని.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు రాజమౌళి ఈ రేసులో ఉంటారని గట్టిగా ప్రచారం జరిగింది. దీనంతటికి వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ ప్రిడిక్షనే కారణమైన.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆడియన్స్‌తో పాటు.. సినీ ప్రముఖులు, విశ్లేషకులు, విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది ఆర్ఆర్ఆర్. ముఖ్యంగా హాలీవుడ్ బడా బడా స్టార్స్ ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అందుకే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుల రేసులో నిలుస్తుందని భావించారు. కానీ కనీసం ఇండియా నుంచి ఎంట్రీ కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో ఆర్ఆర్ఆర్ పై రాజకీయం జరిగిందని విమర్శిస్తున్నారు నెటిజన్స్.
అన్ని విధాలుగా, కమర్షియల్‌గా సక్సెస్ అయిన చిత్రాన్ని పక్కన పెట్టి.. కేవలం విమర్శకులను మెప్పించిన చిత్రాన్ని కళాఖండంగా భావించి ఆస్కార్ ఎంట్రీ జరిగిందని అంటున్నారు. దీని కోసం తెరవెనక పెద్ద రాజకీయమే జరిగిందంటున్నారు. అయినా ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది. అందుకోసం ఆర్ఆర్ఆర్ అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలో పదివేల మంది సభ్యులకు పిలుపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోను ఆస్కార్స్ రూమ్‌కు ఆర్ఆర్ఆర్ పంపించడమే అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ టాస్క్ అని టాక్. ఇదే జరిగితే అకాడమీలో మెజారిటీ సభ్యులు ఓట్లు వేస్తే నామినేషన్స్ లభించే ఛాన్స్ ఉంది. దాంతో అన్ని విధాలుగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలవడం ఖాయమంటున్నారు. కానీ ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంపై.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువడుతున్నాయి.