»Chandrababu Naidu And Pawan Kalyan Takes Oath As Mlas In Ap Assembly
AP Assembly : అసెంబ్లీలో చంద్రబాబు, పవన్‌ల ప్రమాణ స్వీకారం.. నెరవేరిన బాబు శపథం
ఎన్నికల అనంతరం కొత్త అసెంబ్లీ ఏపీలో తొలిసారి కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
AP Assembly : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గెలిచిన వారంతా తొలిసారి సభలో అడుగుపెట్టి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు(Pawan Kalyan) ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ హోదాలో కూర్చుని వారి చేత ప్రమాణం చేయించారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇవే తొలి ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు కావడంతో గెలిచిన వారందరి చేతా ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేయగా తర్వాత అచ్చెన్నాయుడు, వంగలపూడి అనితలు ప్రమాణం(Oath) చేశారు. గంటలకు సగటున ఏడుగురు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకున్నట్లయితే సుమారు ఏడు గంటల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. అందరి ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుతుంది. ఇందుకు సీనియర్ టీడీపీ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు.
సభ ప్రారంభ సమయానికి ముందుగానే అసెంబ్లీ వద్దకు చేరుకున్న చంద్రబాబు తొలుత అసెంబ్లీ మెట్లకు తలవంచి ప్రణామం చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్లారు. రెండున్నర ఏళ్ల తర్వాత ఆయన తొలిసారి అసెంబ్లీలో సీఎం హోదాలో అడుగు పెట్టారు. 2021లో తాను మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇదే ఆయన అసెంబ్లీలోకి రావడం.