Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా నేడు బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
AP Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ నూతన ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ మేరకు అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. తన ఛాంబర్లో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పర్యావరణ, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతల్లోకి అడుగుపెట్టారు.
ఈ ఉదయం 10:47 నిమిషాలకు ఆయన ఇలా బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన శాఖలకు సంబంధించిన పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఈ సమయంలో ఇంద్ర కీలాద్రి వేద పండితలు ఆయనకు ఆశీర్వాదం అందించారు. అనంతరం తన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు.
మరో పక్క పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) భద్రతను కూడా ఏపీ ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. పలు శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రముఖులు, ఆయన సోదరుడు నాగబాబు సైతం ఆయనను అభినందించారు.