FAKE DOCTORS : జాగ్రత్త! హైదరాబాద్ లో వీధికో నకిలీ డాక్టర్!
నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మెడికల్ కౌన్సిల్ స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. అందులో వీధికో శంకర్ దాదా కనిపిస్తుండటం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Medical Council Raids : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నకిలీ డాక్టర్లను గుర్తించేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) వరుసగా రైడ్లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన రైడ్లలో 50కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్టు చేసి రిమాండుకు సైతం తరలించారు.
ఈ రైడ్లలో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కువగా నకిలీ డాక్టర్లు ఉండటాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. మేడ్చర్, ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ సహా పలు చోట్ల అధికారులు ఎనిమిది బృందాలుగా వెళ్లి దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రైడ్లలో నివ్వెరపోయే విధంగా వైద్యులు(Doctors) ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. కొందరైతే కనీసం డిగ్రీ అయినా లేకుండా వైద్యులుగా చలామణీ అవుతున్నారు.
కొందరు ఆసుపత్రుల్లో కొంత కాలం పాటు నర్సులుగా, కాంపౌండర్లుగా పని చేసి వేరే చోట వైద్యులమని(Doctors) చెప్పుకుంటూ సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయమై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ డాక్టర్ల(Fake Doctors) బెడద ఎక్కువగా ఉందన్నారు. మినిమం క్వాలిఫికేషన్ కూడా లేకుండా వైద్యం చేస్తున్నారని చెప్పారు. అర్హత లేని వారు నిబంధనల ప్రకారం యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ లాంటి మందుల్ని సిఫారసు చేయకూడదని అన్నారు. అయితే ఇష్టారాజ్యంగా వాటిని పంచుతున్నారని ఆయన చెప్పారు.