వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. తాను వైసీపీకి దూరమవుతానని తెలిపారు. అయితే ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేయని అతడు వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు.
ఈ పరిణామం అనంతరం తొలిసారి ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో కోటంరెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తిరుగుబాటుతో ఒంటరిగా మారిన తనను టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీ చేర్చుకోకున్నా తాను బీఆర్ఎస్ పార్టీలోనైనా చేరుతానని ప్రకటించారు. నువ్వు వద్దు బాబు అని ఆ పార్టీలు తనను అంటే సీఎం కేసీఆర్ పార్టీలో చేరేందుకు సిద్ధమని కోటంరెడ్డి తెలిపారు. ఇక తిరుగుబాటు చేయడంతో జగన్ ప్రభుత్వం తనను వేధింపులకు గురి చేసే విషయం తెలుసని.. అన్నీ తెలిసే బయటకు వచ్చానని చెప్పారు. తనను ఎన్ కౌంటర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా జరిగిందని పునరుద్ఘాటించారు. తాను వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరి మనిషి తెలిపారు. పార్టీలో పొమ్మనలేకనే తనపై ఈ విధంగా నిఘా పెట్టారని వాపోయారు. ఏదీ ఏమైనా తన శ్వాస రాజకీయమని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు.