Tan : వేసవిలో ట్యాన్ అయిపోయారా? ఇవి ప్రయత్నించండి!
ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా మనం కొన్ని సార్లు బయటకు వెళ్లి రావడం అనేది తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు కచ్చితంగా ట్యాన్ అయిపోతుంటాం. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం రండి.
Tan Removal : ఎండలు మండిపోతున్నాయి. అయినా మన పనులేవో మనకు ఉంటాయి. ఏదేమైనా కొన్ని సార్లు బండి మీద బయటకు వెళ్లి పనులు చేసుకుని రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎండ వేడిమికి చర్మం కమిలిపోయి నల్లగా అయిపోయినట్లు అవుతుంది. దీన్నే ట్యాన్(Tan) అంటారు. దీన్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే బోలెడు పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితో ఫేస్ ప్యాక్‌లు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రండి.
ఎండ వల్ల వచ్చే ట్యాన్‌ని పోగొట్టేందుకు టమాటా(Tomato) బాగా ఉపయోగ పడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి సాంత్వన కలిగిస్తాయి. ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకువస్తాయి. తేమని నిలిపి ఉంచి సహజంగా మెరిసేలా చేస్తాయి. కాబట్టి ముఖం ట్యాన్తో డల్‌గా ఉందని అనుకున్నప్పుడు ఉదయం, సాయంత్రం చిన్న టమటా ముక్క తీసుకుని ముఖానికి రుద్దండి. పావుగంట అలా వదిలేసి తర్వాత ముఖం కడుక్కోండి.
అందరికీ తేనె, బొప్పాయి పండులాంటివి ఎక్కడైనా లభ్యం అవుతాయి. ఇవి మీ ఇంట్లో అందుబాటులో ఉంటే ఈ ఫేస్ ప్యాక్‌ను ప్రయత్నించవచ్చు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఎండ వల్ల ఏర్పడ్డ నలుపును తొలగించడంలో సహకరిస్తుంది. అలాగే తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. చర్మం నిగారింపుగా ఉండేందుకు తోర్పడుతుంది. అందుకనే రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో ఒక స్పూను తేనె వేసి ముఖానికి, మెడకి ఫేస్ ప్యాక్‌లా ( Face Pack) వేసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోండి. క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఇలా చేస్తే ట్యాన్ మొత్తం పోయి ముఖం మెరిసిపోతుంది.