Elections : ఓటు వేయాలంటూ తల్లిదండ్రులకు పిల్లలు లక్ష ఉత్తరాలు
ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. దాన్ని తమ తల్లిదండ్రులకు గుర్తు చేస్తూ అస్సాంలో లక్ష మంది విద్యార్థులు తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులు రాశారు.
Lok Sabha Elections : ముందున్నదంతా ఎన్నికల కాలం. అందుకనే ఇప్పుడు అందరి దృష్టి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల మీదే ఉంది. అయితే భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునే శాతం చాలా తక్కువగా ఉంటోంది. అందుకనే అస్సాంలోని కొందరు విద్యార్థులు ఏకంగా లక్ష ఉత్తరాలు( Postal Cards) రాశారు. ఎందుకంటే…
లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అస్సాంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులు రాశారు. మే 7న వారి జిల్లాలో మూడో విడతలో భాగంగా పోలింగ్ జరుగుతుంది. వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం ‘మా ద్యూటాలోయ్, వోట్డానోర్ అహబాన్’ (ఓటు వేయమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి) ప్రచారం చేపట్టింది.
కామ్రూప్ జిల్లా కమిషనర్, హైదరాబాద్కు చెందిన కీర్తి జల్లి మాట్లాడుతూ పిల్లలు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ద్వారా వారిపై భావోద్వేగ ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది భవిష్యత్తు తరానికి పెద్దలను జవాబుదారీగా చేస్తుందని వివరించారు. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు తప్పకుండా ఓటేసేందుకు ఉద్యుక్తం అవుతారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా ఓటు వేయడంపై ఇలా సర్వత్రా అవగాహన కల్పించడం అనేది తప్పనిసరి.