Telangana: తెలంగాణలో 2 రోజులు వడగాల్పులు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో శని, ఆది వారాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana: రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోగవుతున్నాయని తెలిపింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తదనుగుణంగా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. శనివారం.. నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మహబూబ్‌నగర్, నిర్మల్, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, ఖమ్మం, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు(Heat Wave) వీస్తాయని పేర్కొంది.
అలాగే ఆదివారం నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి వాతావరణ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. చదురు మదురుగా జల్లులు పడే అవకాశాలున్నాయని తెలిపింది.