Killi Kruparani: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకీ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీమానాను స్వయంగా సీఎం జగన్‌కు పంపారు. త్వరలో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అయితే కృపారాణి కుమారుడు విక్రాంత్‌కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. 2009 ఎన్నికల్లో ఆమె లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
మొదటి అవకాశంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు. ఆ తర్వాత రోజే పార్టీ ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. నా పుట్టినిల్లు.. మెట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా. కాంగ్రెస్ అంతా వైసీపీలో ఉందని.. నా కుటుంబం అని భావించి ఆ పార్టీలో చేరాను.
కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తామని నన్ను ఆ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఇప్పుడు అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని కృపారాణి అన్నారు. ఆ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చే వాళ్లే ఉండాలి. నాకు తిట్టడం రాదనే పక్కన పెట్టారు. నాకు ఇంత వంచన చేస్తారా? ఈ వంచనకు ఏమని పేరు పెట్టాలి? నాకు పదవి కాదు.. గౌరవం కోరుకుంటున్నా. నన్ను అణచి వేయాలని చూశారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. నన్ను గౌరవించే పార్టీలోకి వెళ్తా.. కృపారాణి బలమేంటో చూపిస్తా.. కచ్చితంగా పోటీలో ఉంటానని ఆమె తెలిపారు.