నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను ఆమె ప్రవేశపెట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలమ్మ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసారు. కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు రోజు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ఎదుట ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రత్యేక ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గత ఏడాదికి సంబంధించి పలు రంగాల ఆర్థిక స్థితిగతులను వివరించారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంస్కరణలను పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందే అవకాశముందని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చునని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ నామినల్ టెర్మ్స్‌లో 11 శాతం ఉంటుందని సర్వే అంచనా వేసింది.
కరెంట్ అకౌంట్ లోటు మరింత విస్తరిస్తే రూపాయి ఒత్తిళ్ళకు గురవుతుందని హెచ్చరించింది. కొనుగోలు శక్తిని బట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో, ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి అయిదో స్థానంలో ఉంటుందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుందని నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేపథ్యంలో మందగమనం నుండి క్రమంగా తేరుకుంటున్నట్లు పేర్కొంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌కు ఫైనాన్స్ చేయగల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రూపాయి వ్యాల్యూను సర్దుబాటు చేయగలమని పేర్కొన్నది. ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు సీపీఐ, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత పరిమితి కన్నా మించిపోలేదని పేర్కొంది.