ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడం మినహా చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతూ రాష్ట్ర సమస్యలను పక్కకు పడేస్తున్నారు విమర్శించారు. జగన్! అసలు నువ్వు రాయలసీమ బిడ్డవేనా అని ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోందని, అతనిని కాపాడేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని ఆరోపించారు.
పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని పలమనేరులోకి ఎంటర్ అయింది. పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. కర్ణాటక సరిహద్దులో పంతాన్ హల్లి దగ్గర లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఈ క్రమంలో పంతాన్ హల్లి పెట్రోల్ బంకులో ఆగారు. తన కాన్వాయ్ వాహనాలకు డీజిల్ కొట్టించారు. స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి తేడాను అడిగి.. తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ పై జగన్ బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 కాగా, ఏపీలో డీజిల్ రూ.99.27, పెట్రోల్ రూ.111.50 గా ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పైన జగన్ రూ.10 వరకు ఎక్కువగా బాధుతున్నాడని ఆరోపించారు.