»Ap High Court Pil In The Court Keep Hyderabad As Joint Capital For Another Ten Years
Ap High Court: కోర్టులో పిల్.. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Ap High Court: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ పిల్‌ను దాఖలు చేశారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్న ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్రప్రభుత్వం విఫలం కారణంగా.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందని అనిల్ కుమార్ పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం వ్యవహరించడంలో విఫలమైందని పొదిలి అనిల్ కుమార్ పిటిషన్లో తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలుకానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఏపీకి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పిటిషన్ వచ్చే బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.