»Vyooham Movie Review How Is The Rgv Strategy Movie
Vyooham Movie Review: ఆర్జీవీ వ్యూహం సినిమా ఎలా ఉందంటే?
ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ వ్యూహం తెరకెక్కించారు. వ్యూహం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వీరశంకర్ రెడ్డి మరణం నుంచి సినిమా మొదలవుతుంది. ఆయన మరణంతో ఆయన కుమారుడు మదన్ (అజ్మల్ అమీర్) ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన తండ్రి మరణంతో అనేక వందలమంది ప్రాణాలు కోల్పోయారని విషయం తెలిసి వారందరినీ ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు. అయితే అందుకు భారత్ పార్టీ హై కమాండ్ ఒప్పుకోదు. దానికి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు(ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీతో కలిసి అక్రమ ఆస్తుల కేసులు పెడతారు. దీంతో ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటాడు మదన్. మదన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాక జరిగిన ఎన్నికల్లో శ్రవణ్ కళ్యాణ్ మద్దతుతో ఇంద్ర బాబు గెలుస్తాడు. ఆ తర్వాత ఇంద్ర బాబుకు శ్రవణ్‌కు మధ్య దూరం ఎందుకు పెరిగింది? మదన్ ప్రజలకు ఎలా దగ్గర అయ్యాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభమైనప్పుడే ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారులు ఎవరినీ ఉద్దేశించినవి కావు అని రాంగోపాల్ వర్మ వాయిస్ ఓవర్ వస్తుంది. కానీ ఈ సినిమా వైఎస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చిత్రీకరిస్తున్నారని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. చాలాసార్లు సెన్సార్‌తో ఇబ్బందులు పడ్డాడు. ఈ సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలో ఎవరికి పోలికలు లేవని, ఒకవేళ ఏవైనా పోలికలు ఉంటే అవి యాదృచ్ఛికమేనని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే వీఎస్ వీర శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి మొదలైన ఈ సినిమా ఆ తర్వాత ఆయన కుమారుడు మదన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులకు లోనయ్యారు? ఎలాంటి పరిస్థితులలో ఓదార్పు యాత్ర మొదలు పెట్టాల్సి వచ్చింది? ఆయనకు అప్పటి భారత్ పార్టీ అధిష్టానానికి ఎందుకు దూరం పెరిగింది? లాంటి విషయాలను డిస్కస్ చేస్తూ మొదటి భాగాన్ని ముగించారు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర, 2014 ఎన్నికలను చూపించడమే కాక అప్పుడు ఇంద్రబాబు, శ్రవణ్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు ఎలా వెళ్లారు? ఎలాంటి హామీలు ఇచ్చారు? మదన్మోహన్ ఎలాంటి హామీ ఇచ్చారు? వంటి విషయాలను చూపించారు. ఆ తర్వాత అసలు లీడర్ కూడా కావాలని అనుకోని మదన్మోహన్ ఎందుకు ప్రజలకు దగ్గర కావాలి అనుకున్నాడు? ప్రజలకు ఏం చేయాలనుకున్నాడు? లాంటి విషయాలను చూపించారు. అయితే నిజానికి ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ గతంలో కొన్ని సందర్భాలలో కొంత మంది వ్యక్తులు ప్రెస్మీట్లో లేదా ఇంటర్వ్యూలలో చెప్పినవే. వాటిని రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా రూపంలో తీశాడు అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు వరకు ఈ సినిమా సాగుతుంది. ఆ మధ్యలో జరిగిన అనేక సన్నివేశాలను సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని వర్గాల వారికి సినిమా నచ్చకపోవచ్చు కానీ వైఎస్ జగన్ ఆయన పార్టీని అభిమానించే వారికి నచ్చే అవకాశాలున్నాయి. మిగతా వారికి ఇది నచ్చకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే మదన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాటల వరకు కరెక్ట్‌గా జగన్‌కి సెట్ అయ్యేలా నటించాడు. ఆయన భార్య మాలతి పాత్రలో నటించిన మానస కూడా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంద్ర బాబు అనే పాత్రలో నటించిన ధనుంజయ్ లుక్స్‌తో పాటు నటనలోకూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను ఇంకా బాగా స్క్రీన్ ప్లే చేసి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ న్యాచురల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+అజ్మల్ యాక్టింగ్
+ఇంద్రబాబు పాత్రలో నటించిన లుక్
+కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
-స్లోగా సాగే కథ
-పాటలు
-రొటీన్ సన్నివేశాలు