Akshay Kumar: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. దేశరాజధాని ఢిల్లీలో చాంద్నీ చౌక్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో ఆఫ్ నాలుగింట్లో, కాంగ్రెస్ మూడింట్లో బరిలోకి దిగబోతుంది.
గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ లోక్‌సభ ఎన్నికల్లో చాంద్నీ చౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అక్షయ్ కుమార్ దిగొచ్చని సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్ కుమార్‌ను సంప్రదించారు. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.