మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనలో చాలా మంది ఉదయాన్నే వ్యాయామం చేస్తుంటాం. అందులో భాగంగా వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు, జిమ్, ఎరోబిక్స్, యోగా లాంటి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటాం. అయితే ఇవి చేయడం వరకు అవగాహనతోనే ఉంటారు. కానీ వర్కవుట్(Workout) తర్వాత ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వ్యాయామాల తర్వాత చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. రండి.
వ్యాయామం పూర్తయిన తర్వాత ఒళ్లంతా చమటలు పట్టేసి చిరాగ్గా ఉంటుంది. దీంతో చాలా మంది వెంటనే స్నానం చేసేందుకు వెళ్లిపోతారు. అయితే దీని వల్ల సమస్యలు వస్తాయని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఓ అరగంటైనా ఆగి తర్వాత మాత్రమే స్నానం చేయడానికి వెళ్లమని సహా ఇస్తున్నారు. అలాగే వ్యాయామం అప్పుడు వేసుకున్న దుస్తులు చమటలు పట్టేసి దుర్వాసన వస్తాయి. వాటిని అలా లాండ్రీ పెట్టెలో వేయడం కంటే… ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉతికేసుకోవాలి. అప్పుడు వాటిలో బ్యాక్టీరియా మరింత పెరిగిపోకుండా ఉంటుంది. శారీరక వ్యాయామం తర్వాత గుండె కొట్టుకునే వేగం కొంత పెరుగుతుంది. అందుకే ఎక్సర్సైజ్ తర్వాత ఇంటికొచ్చిన వెంటనే అలా నిద్రపోవద్దు. బదులుగా బాగా గాలి తగిలే ప్రదేశంలో కూర్చుని కాసేపు విశ్రాంతిగా ఉండాలి.
వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ గంటల పాటు ఏం తినకుండా ఉండటం సరికాదు. ఓ అరగంట రిలాక్స్ అయిన తర్వాత ఏదో ఒకటి తినడం ఉత్తమం. శరీరం వ్యాయామం సమయంలో చాలా క్యాలరీలను కోల్పోతుంది. తిరిగి కండరాలు బలోపేతం కావాలన్నా, నీరసంగా ఉంటే కోలుకోవాలన్నా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరీ ఎక్కువగా కాదు. కొంచెం మాత్రమే. అయితే వెంటనే కాదు. అరగంట తర్వాత అని గుర్తుంచుకోవాలి. అలాగే కనీసం 20 నిమిషాలకుగాని నీరూ తాగకూడదు.