Donald Trump : అమెరికా రోజు రోజుకీ క్షీణిస్తోంది : ట్రంప్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ రకరకాల వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రష్యా ప్రతిపక్ష నేత మృతిపై స్పందించారు. ఇందులో భాగంగా అమెరికాలో అసలు ఏం జరుగుతోందంటూ విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే...
Donald Trump’s Reaction: రష్యా ప్రతి పక్ష నేత అలెక్సి నావల్సీ జైల్లో మూడు రోజుల క్రితం మరణించారు. ఆయన మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆలస్యంగా స్పందించారు. ఆ మృతితో, అమెరికా పరిస్థితిని ముడిపెట్టి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రోజు రోజుకూ క్షీణిస్తోందని, ఇది ఒక విఫల దేశం అని విమర్శించారు.
రష్యా ప్రతిపక్ష నేత మృతికి ట్రంప్(Trump) తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడి పెడుతూ మాట్లాడారు. అమెరికాలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. అలెక్సీ నావల్సీ ఆకస్మిక మృతితో మన దేశంలో ఏం జరుగుతోందో తనకు అవగాహన కలిగిందన్నారు. అన్యాయపూరిత కోర్టు నిర్ణయాలు, రిగ్గింగ్‌లు, సరిహద్దులు తెరవడం లాంటివి అమెరికాను నాశనం చేస్తున్నాయన్నారు. నిజాయతీ లేని వారు, లెఫ్ట్ రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు తమని వినాశనం వైపు తీసుకెళుతున్నారని అన్నారు.
పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఎప్పటి నుంచో న్యాయ పరమైన చిక్కుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. గత వారమే న్యూయార్క్ కోర్టు భారీ జరిమానా విధించింది. బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్న కేసులో 355 మిలియన్ డాలర్లు పెనాల్టీ విధించింది. దీంతో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఎక్కడా పుతిన్ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.