RTC Bus: ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం..పురుడు పోసిన కండక్టర్
తల్లి కావడం అనేది ఓ వరం. నవ మాసాలు ఎంత కష్టమైన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పులొస్తాయో చెప్పలేం. అలాగే ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో కండక్టర్ సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది.
RTC Bus: తల్లి కావడం అనేది ఓ వరం. నవ మాసాలు ఎంత కష్టమైన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పులొస్తాయో చెప్పలేం. అలాగే ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో కండక్టర్ సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది. కర్ణాటకలోని చిక్కమగళూరులో మే 15 సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తున్న బస్సులో దాదాపు 45 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఫాతిమా(22) అనే మహిళ కూడా ఉంది. ఆమె నిండు నెలల గర్భిణి. బస్సు వెళ్తున్న సమయంలో ఫాతిమాకు ఉన్నట్లుండి నొప్పులు మొదలయ్యాయి. అది గమనించిన ఆ బస్సు కండక్టర్ వసంతమ్మ బస్సును ఆపమని డ్రైవర్ కు సూచించడం బస్సు రోడ్డు పక్కన ఆపేశారు. వెంటనే వసంతమ్మ ప్రయాణికులందరినీ కిందకు దిగమని చెప్పింది. ఆ తర్వాత బస్సులోనే బిడ్డను ప్రసవించేందుకు ఫాతిమాకు పురుడు పోసింది. అలా కండక్టర్ వసంతమ్మ సాయంతో ఫాతిమా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
అంతేకాదు వసంతమ్మ ప్రయాణికుల దగ్గర రూ.1500 రూపాయిలను వసూలు చేసి ఫాతిమాకు ఆమె అర్థిక సహాయాన్ని కూడా అందించారు. దీంతో కండక్టర్ వసంతమ్మ అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వసంతమ్మ అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించారు. ఫాతిమాను అక్కడి నుంచి అంబులెన్స్ లో శాంతిగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. వసంతమ్మ 20 ఏళ్ల క్రితం లేబర్ వార్డులో అసిస్టెంట్ గా పని చేయటం ఫాతిమా పాలిట మంచిదైంది. లేబర్ వార్డులో పనిచేసి వసంతమ్మ కేఎస్ఆర్టీసీలో కండక్టర్ గా చేరారు. ప్రసవం చేసిన కండక్టర్ వసంతమ్మతో పాటు తల్లీ బిడ్డల ఫోటోలను కేఎస్ ఆర్టీసీ ట్విట్టర్ లో షేర్ చేసింది.