Brazil: చనిపోయిందని పూడ్చిపెట్టారు.. 11 రోజుల తర్వాత ఏమైందంటే?
ఓ మహిళ చనిపోయిందని ఆమె కుటుంబీకులు సమాధి చేశారు. శవపేటికలో ఆ మహిళ 10 రోజులు ప్రాణాలతో పోరాడింది. ఆఖరికి ఆమెను బయటకు తీసినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు.
ఓ మహిళ చనిపోయిందని అనుకుని ఆమెను సమాధి చేశారు. అయితే ఆమె చనిపోలేదు. సమాధిలోనే ప్రాణాలను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని అర్థించింది. ఆఖరికి రక్తపుమడుగులో 11 రోజులకు ఆమెకు విముక్తి లభించింది. అయినా ఆమె ప్రాణాలు ఎక్కువసేపు నిలువలేదు. ఈ దారుణ దారుణ ఘటన బ్రెజిల్ (Brazil)లో చోటుచేసుకుంది. రిచాఓ దాస్ నెవాస్ నగరానికి చెందిన రోసంగేలా అల్మాండా అనే 37 ఏళ్ల మహిళకు గుండెపోటు వచ్చింది. ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించి ఆమె దేహాన్ని శవపేటికలో పెట్టి సమాధి చేశారు. 10 రోజుల తర్వాత ఆ వైపు వెళ్తున్న వారికి ఆ సమాధి నుంచి శబ్దాలు రావడం తెలిసింది. కాపాడమని అరుపులు వినపడటంతో ఆమె బంధువులకు సమాచారం అందించారు. బంధువుల సమక్షంలో శవపేటికను తెరిచి చూడగా అందరూ షాక్ అయ్యారు. మరికొందరు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు.
ఆ మహిళను శవపేటికలో పెట్టిన తర్వాత దాని తలుపులు విరగ్గొట్టడానికి ఆమె విశ్వప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో మోకాళ్లకు, కాళ్లకు రక్తపు గాయాలయ్యాయి. మేకులు తీసే ప్రయత్నంలో గోర్లు కూడా విరిగిపోయాయి. ఆ శవపేటిక మొత్తం రక్తపు మరకలతోనే నిండిపోయింది. శవపేటిక తలుపు తీసిన తర్వాత కాసేపటికే ఆమె శరీరం చల్లగా మారింది. అందరూ చూస్తుండగానే ఆమె తన ప్రాణాలను కోల్పోయింది.