plz.. tell Covid origins WHO chief asked to countries
కరోనా వైరస్ (Coronavirus) కేసులు మళ్లీ బుసలు కొడుతున్నాయి. ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు కొత్త వేరియంట్ అందరిలోనూ భయాందోళనను కలిగిస్తోంది. కేరళలో జేఎన్.1 వేరియంట్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
జేఎన్.1 వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు రాదని తెలిపింది. జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (variant of interest)గా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉందని, కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ పుట్టినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక విడుదల చేసింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. దేశంలో గత 24 గంటల్లో 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి చేరగా 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు సంభవించాయి. అందులో కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.