పిల్లల కోసం ప్రాణం ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటారు. వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. కానీ… ఈ తల్లిదండ్రులు మాత్రం…. తమ కన్న కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్లిపోయారు. బాబుకి టికెట్ లేదని ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టనివ్వలేదని…. కొడుకును ఎయిర్ పోర్టులోనే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ జంట ఇజ్రాయెల్ నుంచి బెల్జియంలోని బ్రస్సెల్స్ కు వెళ్లవలసి వచ్చింది. అందుకు తమ కొడుకుతో సహా ర్యాన్ఎయిర్ విమానం ఎక్కేందుకు ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.
ఐతే ఈ జంట తమ కొడుకుకి టికెట్ కొనుగోలు చేయలేదు. చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఎయిర్పోర్ట్ సిబ్బంది పిల్లాడికి టికెట్ ఇవ్వమని అడిగారు.సదరు జంట పిల్లాడికి టికెట్ కొనలేదని తెలిపారు. కొంత డబ్బు చెల్లించి టికెట్ కొనమని అధికారులు సూచించారు. అందుకు నిరాకరించిన దంపతులు, తమ కొడుకును అక్కడే వదిలి విమానం ఎక్కేందుకు పరుగులు తీశారు. దీంతో షాక్ తిన్న ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తమయ్యి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దంపతులను బ్రస్సెల్ వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేశారు.