»Another Miracle In Medicine Two Women Who Gave Birth To The Same Child
Miracle: వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. ఒకే బిడ్డను కన్న ఇద్దరు మహిళలు!
ఇద్దరు మహిళలు కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒకే బిడ్డను ఇద్దరు మహిళలు తమ కడుపులో ఎలా మోశారని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వలింగ సంపర్కులైన ఆ జంట ఫెర్టిలిసీ సెంటర్ ద్వారా మగబిడ్డకు జన్మనివ్వడం విశేషం.
వైద్యశాస్త్రంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. తాజాగా ఇద్దరు మహిళలు కలిసి ఒక మగబిడ్డకు జన్మనివ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుట్టిన ఆ మగబిడ్డ ఇద్దరి మహిళల కడుపులోనూ పెరగడం విశేషం. ఈ అరుదైన ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. మజోర్కా ప్రాంతంలోని పాల్మాలో 30 ఏళ్ల ఎస్టిఫానియా, 27 ఏళ్ల అజహారా అనే మహిళలు కలిసి జీవిస్తున్నారు.
ఈ మహిళలు ఇద్దరూ కలిసి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. వారిద్దరూ స్వలింగ సంపర్కులు అయినా పిల్లలు కనాలనే ఆశ వారిలో ఉండేది. అందుకే తమ కడుపులోనే బిడ్డను మోసి కనాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటీ సంటర్ను ఆశ్రయించారు. ఫెర్టిలిటీ సెంటర్ ప్రకారంగా..ముందుగా ఎస్టిఫానియా అనే మహిళ గర్భంలో వైద్యులు వీర్యాన్ని ప్రవేశపెట్టారు. ఆమె గర్భంలో అండం, వీర్యం ఫలదీకరణం చెందేలా చేశారు.
ఫలదీకరణం చెందిన తర్వాత 5 రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా అనే మహిళ గర్భంలోకి వైద్యులు మార్చారు. దీంతో ఒకే బిడ్డను ఇద్దరు మహిళలు తమ కడుపులో మోసి జన్మనిచ్చారు. ఈ మొత్తం ప్రక్రియకు వారిద్దరూ సుమారు రూ.4 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. ఇద్దరు మహిళలు తాము అనుకున్న ప్రకారంగానే తమ కలను సాకారం చేసుకున్నారు. బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఒకరిపై మరొకరికి ఉన్న బంధం పెరిగిందని, వారి మధ్య ఉన్న ఆ బంధం మరింత బలపడిందని వెల్లడించారు.
గతంలో కూడా ఇటువంటి ఘటన జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ ఘటన రెండోది కావడం విశేషం. ఇటువంటి వైద్య విధానాన్ని ఇన్వోసెల్ అనే సంతానోత్పత్తి చికిత్స అని అంటారు. 2018లో అమెరికాలోని టెక్సాస్‌లో కూడా ఇద్దరు మహిళ ఈ విధానంలోనే బిడ్డను కన్నారు. అప్పట్లో వారిద్దరూ తమ ఇద్దరి కడుపులో బిడ్డను మోసిన తొలి స్వలింగ జంటగా చరిత్రకెక్కారు. స్వలింగ సంపర్కులు ఈ మధ్యకాలంలో మాతృత్వపు అనుభవాన్ని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరికి కోసం ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఇన్వోసెల్ సంతానోత్పత్తి చికిత్సను అమలు చేస్తున్నట్లు నిపుణులు చెబున్నారు. ఈ చికిత్స వల్ల బిడ్డకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవని అంటున్నారు.