మహారాష్ట్రలో శివ సేన (shiv sena) పార్టీకి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ లైవ్లో మాట్లాడుతున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ విషయంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కాల్పులు జరిపినది ఎవరో ఇప్పటి వరకు తెలియ రాలేదు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
గురువారం సాయంత్రం ముంబై సివార్లలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఫేస్ బుక్ లైవ్లో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయనను వెంటనే స్థానిక కరుణ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అభిషేక్ ఘోసల్కర్ శివసేన(యూటీబీ) ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు కావడం గమనార్హం. ఇటీవల అభిషేక్ ఘోసల్కర్ (Abhishek Ghosalkar)కు వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాకు మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనకు నోరోన్హానే కారకుడని, అతడు కూడా తనను తాను కాల్చుకుని మృతి చెందాడని వార్తలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కాల్పులు జరిగిన సమయంలో మెహుల్ పారిఖ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.