Revanth Reddy: 30 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఇచ్చే ఆరు గ్యారంటీలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టంచేశారు.
Revanth Reddy: ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టంచేశారు. 2004లోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారని.. చెప్పినట్టుగానే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏపీలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని.. అయినప్పటికీ మాటకు కట్టుబడ్డారని తెలిపారు. తుక్కుగూడ సభలో సోనియాగాంధీ (sonia gandhi) ఆరు గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు అమలు చేస్తామని స్పష్టంచేశారు.
తాజ్ కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ (cwc) రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత సోనియా గాంధీ (sonia), రాహుల్ గాంధీ (rahul), మల్లకార్జున ఖర్గే (kharge) సహా నేతలంతా బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. కాంగ్రెస్ విజయ భేరీ సభకు రాష్ట్ర నాయకత్వం 10 లక్షల మందిని తరలించే ఏర్పాట్లు చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను సోనియా గాంధీ (sonia gandhi) విడుదల చేస్తారు. 6 హామీల గ్యారంటీ కార్డ్ రిలీజ్ చేస్తారు. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయభేరీ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ రానుంది. ఇకపై గల్లీ గల్లీ తిరిగి, పార్టీ అధికారంలోకి వస్తే.. చేసే కార్యక్రమాలను వివరిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అంటున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో నేతలు/ శ్రేణులు ఇప్పటినుంచే కష్టపడుతున్నారు. నవంబర్/ డిసంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్టోబర్ 10వ తేదీ లోపు షెడ్యూల్ రాకుంటే.. జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల ప్రస్తావించారు.