తెలంగాణ(Telangana)లో దసరా పండుగను ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా దసరాకు పండక్కి (Dussehra festival) తప్పక సొంతూరు వస్తుంటారు. దసరా రోజున పాలపిట్ట (milk quail)ను చూసేందుకు ప్రజలు ప్రత్యేకంగా ఊరి చివరకు, పొలాలకు వెళ్లి మరి పాలపిట్ట కనిపిస్తుందేమోనని చూస్తారు.
పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు.పాండవులు (Pandavas) అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది. అప్పటి నుంచి వారి కష్టాలు తొలగిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులు ఏం చేసినా విజయాలే కలిగాయంట. అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
అందరూ సాయంత్రం తప్పకుండా జమ్మిచెట్టు(Jammichettu)ను దర్శించుకుంటారు. ఆ తర్వాత పాలపిట్టను చూస్తారు. అయితే, దసరా రోజున జమ్మి చెట్టును దర్శించుకోవడం చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. పండుగ రోజున జమ్మి చెట్టును పూజించి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన వృక్షాల్లో జమ్మి చెట్టు(శమీ వృక్షం) ఒకటని ప్రజలు నమ్ముతారు.