తెలంగాణ సీఎం అభ్యర్థిని మంగళవారం సాయంత్రంలోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నేటి సాయంత్రం డీకే శివకుమార్..సీఎం అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి
సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.
తెలంగాణ (Telangana)కు కాబోయే సీఎం (CM) పేరును సాయంత్రంలోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) వెల్లడించారు. తెలంగాణకు సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి అత్యధిక మెజార్టీ రావడంతో సోమవారమే సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ అనుకున్నారు. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే పార్టీలో సీనియర్ నేతలు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటివారు సీఎం కుర్చీ కోసం పోటీ పడడంతో సీఎం ఎంపిక వాయిదా పడింది.
సీఎల్పీ మీటింగ్ (CLP Meeting) తర్వాత సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకులు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు దానికి సంబంధించిన నివేదికను వారు సమర్పించారు. ఈ విషయంపై మల్లికార్జున ఖర్గే మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సాయంత్రంలోపు క్లారిటీ ఇస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిశీలకులు ఓ నివేదిక ఇచ్చారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపి సీఎం అభ్యర్థి పేరును ప్రటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే సీఎం పదవి కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రమే ఢీల్లీకి పయనమయ్యారు. వారు రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్‌తో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు.