తెలంగాణలో మరో నిరుద్యోగ నిరసన దీక్ష(Unemployment protest)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఈనెల 28న నల్గొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(revanth reddy) ఆధ్వర్యంలో చేపట్టనున్న నల్గొండ నిరుద్యోగ దీక్షకు రంగం సిద్ధమైంది. వచ్చే వారంలో ఏప్రిల్ 28 నిరుద్యోగ నిరసన(Unemployment protest) కార్యక్రమం చేపట్టనున్నారు. నల్గొండలో టీపీసీసీ అధ్యక్షుడు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చి క్యాడర్ పాల్గొనాలని ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తమకు సమాచారం ఇవ్వలేదని దీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అనంతరం ఇద్దరు ఎంపీలు తమ మద్దతు ప్రకటించడంతో నిరుద్యోగ దీక్ష ఖారారైనట్లు తెలుస్తోంది.
అయితే సీనియర్ల మధ్య వివాదాన్ని ఏఐసీసీ కార్యదర్శి నదిమ్ షా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జీ మాణిక్ రావు చొరవ తీసుకుని వారితో మాట్లాడారు. ఆ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. దీంతో ఏప్రిల్ 28న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లతోపాటు అనేక మంది నేతలు వస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది తెలియాలంటే ఈనెల 28 వరకు ఆగాల్సిందే.