»The Young Man Was The First To Spot And Save The Falaknuma Express Accident Raju
Falaknuma Express: ప్రమాదం మొదట గుర్తించి కాపాడిన యువకుడు
ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అనేక మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరో తెలిసింది. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న రాజు అనే వ్యక్తి అప్రమత్తమై ట్రైన్ చైయిన్ లాగాడు. అంతేకాదు అక్కడ ఏం జరిగిందో తన మాటాల్లోనే విందాం రండి.
ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express)లో బోనగిరి సమీపంలో 5 కోచ్‌లు దగ్ధమైన అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. అగ్ని ప్రమాదానికి దారితీసిన విధ్వంసం లేదా కుట్ర సహా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగినపుడు ఓ యువకుడు అప్రమత్తం కావడం వల్లే అనేక మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే పసిగట్టిన అతడు రైలు చైన్ లాగి ప్రయాణికులను అప్రమత్తం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లేపురానికి చెందిన రాజు(raju).. ఐడీఏ బొల్లారం లక్ష్మీనగర్‌లో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
అసలు ఏం జరిగిందో అతని మాటల్లోనే.. ఒడిశా(odisha)లోని పర్లాకిమిడి నుంచి అమ్మమ్మ ఊరికి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కాం. S4 కంపార్ట్మెంట్లో నేను, మా అమ్మ పార్వతి, అక్క పావని, అమ్మమ్మ బృందావతి కూర్చున్నాం. ఉదయం 11 గంటల సమయంలో నేను టాప్ బెర్త్‌పై పడుకుని ఉండగా.. రబ్బరు కాల్చినట్లు వాసన వచ్చింది. పై నుంచి వేడి వస్తుంది. ఎండ ఉంటుందనుకునే సరికి వాసన ఎక్కువైంది. కిందకు వెళ్లి కిటికీలోంచి చూసేసరికి పొగలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నేను వెంటనే అరిచి, చైన్ లాగాను. రైలు నడుస్తూనే ఉంది. రెండోసారి గట్టిగా లాగగా రైలు ఆగింది. అప్పటికే అనేక మంది ప్రయాణికులు నవ్వుతున్నారు. నేను అగ్నిమాపక కేంద్రం, 108కి సమాచారం అందించాను.
ఆ క్రమంలో నేను మా కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చాను. ఎందుకంటే ప్రమాద కేంద్రం(fire accident) మా బెర్త్‌లోనే జరిగింది. మా మూడు బ్యాగులు, నగదు, సామగ్రి కాలిపోయాయి. నేను తోటి ప్రయాణికులు కిందకు దిగేందుకు సహాయం చేశాను. అదే సమయంలో పొగ, మంటలు మరింత పెరిగాయి. ఆ నేపథ్యంలోనే నేను ఎక్కువ పొగ పీల్చి మూర్ఛపోయాను. అక్కడికి వచ్చిన పలువురు మమ్మల్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు స్పృహలోకి వచ్చాను. రాత్రి 11 గంటలకు ఐడీఏ బొల్లారం ఇంటికి చేరుకున్నాము. అరుస్తూ, రైలు చైన్ లాగి, ఆపి, కేకలు వేయడం వల్లే అనేక మంది ప్రయాణికులు కొద్ది నిమిషాల్లోనే కిందకు దిగారు. ఐదారు నిమిషాలు ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగేదని వెల్లడించారు.