»The Number Of Vultures Has Increased From 10 To 33 In Four Years In Telangana
Vultures : అక్కడ పది నుంచి 33కు పెరిగిన రాబందుల సంతతి
అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న రాబందులు తెలంగాణలోని కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో కొద్దిగా వృద్ధి చెందుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Vultures In Telangana : ఇదువరకటి కాలంలో రాబందులు విరివిగా కనిపిస్తూ ఉండేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీటి మనుగడ తగ్గిపోయింది. దీంతో ఇప్పుడివి అంతరించిపోయే జీవుల జాబితాలోకి చేరిపోయాయి. దాదాపుగా కనుమరుగు అయ్యే స్థితిలోకి వచ్చేశాయి. అయితే తెలంగాణ(Telangana) రాష్ట్రం పెంచికల్ పేట మండలంలోని నందిగామ దగ్గర పాలరాపుగుట్ట అనే చోటు ఉంది. నాలుగేళ్ల క్రితం అక్కడ ఈ రాబందుల (Vultures) ఉనికిని గుర్తించిన అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు. అప్పుడు అవి పది మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 33కు చేరింది.
రాబంధులను కాపాడేందుకు అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గుట్టపై ఐదు ఎకరాల్లో చుట్టూ రక్షణ కోసం ఫెన్సింగ్ని ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. రాబందులు ఏం చేస్తున్నాయి? వాటికి ఎవరైనా హాని కలిగిస్తున్నారా? అన్న విషయాలను పరిశీలించేందుకు చుట్టూరా సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఈ చర్యల ఫలితంగా అక్కడ గత నాలుగేళ్లలో రాబందులు వృద్ధి చెందాయి.
పారాపు గుట్ట దగ్గర రాబందుల నివాసానికి అనువుగా ఉంది. అక్కడున్న రంధ్రాల్లో లాంగ్ బిల్డ్ వల్చర్ జాతికి చెందిన రాబందులు నివాసాలు ఏర్పాటు చేసుకుని క్రమంగా మెల్లిగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానిక అటవీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అవి వాటి సంతతిని మరింత వృద్ధి చేసుకున్నా అందుకు వీలుగా సౌకర్యాలు గుట్టపై ఉన్నాయని వారు చెబుతున్నారు.