ఇటీవల కాలంలో భారత్లో జనాభా గణన జరగనప్పటికీ ఆ వివరాలు మాత్రం ఏదో ఒక రకంగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ జనాభా 144 కోట్లుగా ఉందట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరంటే..?
Indias Population 144 Crores : భారత్లో ప్రస్తుతం ఉన్న జనాభా 144 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2021లో భారత్లో జనాభా గణన అనేది జరగాలి. అయితే కరోనా కారణంగా ఆ పని కాలేదు. దీంతో 2011లో జరిగిన జనాభా గణన లెక్కలే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నాయి. అయితే ఈ విషయమై యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) ఓ నివేదికను విడుదల చేసింది. భారత్లో 144 కోట్లపైనా జనాభా ఉన్నారని అంచనాకు వచ్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్(India) మొదటి స్థానంలో ఉంది. 142 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది.
యూఎన్ఎఫ్పీఏ నివేదిక(UNFPA Report) ప్రకారం.. భారత దేశ జనాభాలో(Population) సున్నా నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు 24 శాతం మంది ఉన్నారు. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు 17 శాతం మంది ఉన్నారు. 10 నుంచి 24 ఏళ్ల వయసు లోపు ఉన్న వారు అత్యధికంగా 68 శాతం మంది ఉంటారని అంచనా. సీనియర్ సిటిజన్లు మాత్రం భారత్లో ఏడు శాతం మందే ఉన్నారని తెలుస్తోంది.
మన దేశంలో సరాసరి జీవన కాలం పురుషులకు 71 సంవత్సరాలుగానూ, స్త్రీలకు 74 సంవత్సరాలుగానూ ఉంది. అలాగే 2006 నుంచి 2023 మధ్య కాలంలో ఇక్కడ 23 శాతం బాల్య వివాహాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. అలాగే మిగిలిన దేశాలతో చూసుకుంటే ప్రసూతి మరణాలు భారత్లో 8 శాతం మేర ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.