తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆయన విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సినియర్ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
కేవలం ఈ సమావేశం కోసమే కేసీఆర్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విజయవాడకు వెళ్తుండటం గమనార్హం. ఈ సమావేశానికి కేసీఆర్ తో పాటు… కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, నితీశ్ కుమార్తో పాటు కేసీఆర్ కూడా హాజరౌతుండటం గమనార్హం.
కేసీఆర్ చివరిసారిగా 2019, జూన్ 17న విజయవాడకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ని ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా… దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక నియంతృత్వ పాలన సాగుతోందని… వచ్చే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి దశ, దిశ నిర్దేశించే రాజకీయ తీర్మానం చేస్తామని సీపీఐ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. సీపీఐ జాతీయ సమావేశాలకు 20 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు హాజరవుతారని తెలిపారు.