పదో తరగతి ప్రశ్నాపత్రాల (SSC Exams Leak) లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) జైలు నుంచి విడుదలయ్యాడు. గురువారం రాత్రి బెయిల్ (Bail) లభించడంతో శుక్రవారం ఉదయం ఆయన బయటకు వచ్చాడు. షరతులను ఉల్లంఘించకూడదని కోర్టు (Court) హెచ్చరిస్తూ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ను జైలు (Jail) అధికారులు విడుదల చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజ్ కావడం వెనుక బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) తదితరుల ప్రమేయం ఉందని కేసు నమోదైంది. పక్కా ఆధారాలతో (Evidence) పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో ఢిల్లీలో కూడా తీవ్ర సంచలనం రేపింది. మంగళవారం అర్ధరాత్రి సంజయ్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వడంతో బీజేపీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. సంజయ్ కు బెయిల్ కోసం బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నా చేశారు.
హన్మంకొండ (Hanamkonda Munsif Court) మున్సిఫ్ మెజిస్ట్రేట్ లో సుదీర్ఘ విచారణ జరిగింది. సంజయ్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు, బెయిల్ కోసం బీజేపీ నాయకులు పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం మెజిస్ట్రేట్ రాపోలు అనిత విచారణ చేపట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం సంజయ్ కు అనుకూలంగా మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో సంజయ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రూ.20 వేల సొంత పూచీకత్తుతోపాటు దేశం దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దని కోర్టు సంజయ్ కు హితవు పలికింది. బెయిల్ వెలువడడంతో శుక్రవారం ఉదయం బయటకు వచ్చారు. కాగా సంజయ్ విడుదలైన సందర్భంగా కరీంనగర్ లో 144 సెక్షన్ విధించారు. అల్లర్లు, ప్రదర్శనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.